Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్..!
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్..! వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు
Big Shock To Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షాకిచ్చింది సుప్రీం కోర్టు. అక్రమ మైనింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం తప్పుబట్టింది.
కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఇవాళ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలు కేసుల్లో చిక్కుకుని ఐదు నెలల పాటు జైల్లోనే ఉంటూ అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన తాజాగా విడుదలయ్యారు. గతంలో ఆయన నిందితుడిగా ఉన్న ఓ కేసులో ఏపీ హైకోర్టులో ఊరట లభించగా.. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ వంశీకి చుక్కెదురైంది.

గత వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీపై నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కూటమి సర్కార్ కేసులు నమోదు చేసింది. ఈ కేసులో అరెస్టు చేస్తారనే భయంతో వంశీ ఏపీ హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు అనుమతి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున వంశీకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో వంశీకి అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ వాదన వినకుండా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని కూడా సుప్రీం తప్పుబట్టింది. అలాగే వంశీపై నమోదైన అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చే విషయంలో మరోసారి విచారణ చేయాలని హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ కేసు లోతుల్లోకి వెళ్లడం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. అదొక్కటే వంశీకి ఊరటగా భావించవచ్చు.
వల్లభనేని వంశీపై నమోదైన మిగిలిన కేసుల్లో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టుతో పాటు కింది కోర్టులు ఆయనకు బెయిల్స్ మంజూరు చేశాయి. దీంతో ఆయన తాజాగా విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత మరోసారి అస్వస్థతకు గురి కావడంతో తిరిగి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో హైకోర్టులో వంశీ ముందస్తు బెయిల్ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.
Share this content:
Post Comment